పీకేవోసీ2 డీప్‌సైడ్ బ్లాక్‌తో 10 వేల కోట్లకుపైగాఆదాయం :మంత్రి కిషన్ రెడ్డి

పీకేవోసీ2 డీప్‌సైడ్ బ్లాక్‌తో 10 వేల కోట్లకుపైగాఆదాయం :మంత్రి కిషన్ రెడ్డి
  • వేలంలో సిగరేణికి బ్లాక్ ​దక్కేందుకు కృషి చేశా: కిషన్ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేవోసీ-2 (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ కోల్ బ్లాక్‌ వేలంలో సింగరేణికి దక్కడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే, పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశముందని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఆర్థికాభివృద్ధికి ఇది మరో కీలకమైన ముందడుగని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు, సింగరేణి కార్మికులకు, కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రిగానే కాకుండా, తెలంగాణ బిడ్డగా.. ఈ డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా అన్నిరకాలుగా బాధ్యత వహించినట్లు చెప్పారు. ఈ డిప్‌సైడ్ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ మైన్ నడుస్తుందని చెప్పారు.

ఇక్కడ దొరికే నాణ్యమైన జీ-8 బొగ్గు కారణంగా సింగరేణికి రూ.43 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అన్నారు. నైనీ, తాడిచర్ల–2, పీకేవోసీ–2 డిప్‌సైడ్ బ్లాక్‌లు సింగరేణికి దక్కడంతో రాష్ట్రంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనలో మెరుగైన భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ మూడు గనులతో మొత్తం 860 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు సమకూరనున్నాయని వివరించారు.   వీటి ద్వారా సింగరేణికి రూ.1,95,510 కోట్ల భారీ ఆదాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.48 వేల కోట్ల పైచిలుకు రాబడి లభిస్తుందన్నారు. దాదాపు 6,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు.